Friday, June 18, 2010

శ్రీ శ్రీ, - మహాకవి శ్రీ శ్రీ శత జయంతి 1910 - 2010


మహాకవి శ్రీశ్రీ
శ్రీశ్రీ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు.

ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.


జీవిత గమనం

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ( శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు)

శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.


1935లో విశాఖలోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.

 1947 లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
 
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
 

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషను అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

No comments:

Post a Comment