Friday, June 18, 2010

ఈ శతాబ్ది నాది : శ్రీశ్రీ


ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.

1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవిని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు.

మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్‌‌లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయంగా రాసాడు. అందులో ఇలా రాసాడు.

..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాలలోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది.

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీర లేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.

శ్రీశ్రీ కవిత్వం మహోన్నత మానవత్వపూరితమైనది. మా తరం వాళ్ళమందరం ఆయన మరో ప్రపంచపు కాంతి ధగ ధగలకి ఆకర్షితులమై ఆ బాటలో ప్రయాణం చేసినవాళ్ళమే. ఆయన అందించిన ఉత్తేజం ఎప్పటికీ అలా వెలుగుతూనే ఉంటుంది. శ్రీశ్రీ తెరిచిన నూతన గవాక్షాలు కార్మికులు, కర్షకులు- సకల శ్రమజీవులకీ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.

ఇవాళ మన కర్తవ్యం శ్రీశ్రీ కవిత్వాన్ని మెచ్చుకోవడం, ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తడం మాత్రమే కాదు, ఆయన వేసిన బాట మీద సాగి ఆ మహా ప్రస్థానంలో నూతన లోకాలను ఆవిష్కరింపచేసుకోవడం.

వోల్టేర్‌ గురించి చెప్పడం అంటే మొత్తం 18వ శతాబ్దాన్ని గురించి చెప్పడం అన్నాడు విక్టర్‌ హ్యూగో. అలాగే శ్రీశ్రీ గురించి చెప్పడం అంటే 20వ శతాబ్ది తెలుగు కవిత్వం మొత్తం గురించి చెప్పడమే. గురజాడతో పడిన అడుగు జాడ ఇరవై, ముప్ఫై ఏళ్ళ విరామం తర్వాత విస్పష్టమైన శ్రీశ్రీ వారసత్వంతో ముందుకు వచ్చింది.

ఆధునిక భావజాలం, అభ్యుదయ పథం ఈ శతాబ్ది కవిత్వంలో పటిష్ఠంగా పాదుకోవడానికి శ్రీశ్రీయే మూలవిరాట్టు. ఆయన దేశ చరిత్రలు అనే గేయం మార్క్సిస్టు చారిత్రక విశ్లేషణకి కవితా రూపం. చరిత్ర నిర్మాతలు ఎవరో అది చాటింది.

శ్రీశ్రీ ఆధునిక కవిత్వానికి అందించిన మహత్తర కానుక లాలిత్యభరిత సౌకుమార్య పదబంధాన్ని పెకలించడం. శ్రీశ్రీ తన కవిత్వ విప్లవ అలంకారికతతో ఆ నీడలు కూడా కవిత్వం మీద పడకుండా తరిమేశాడు. సామ్యవాద మానవుడే శాస్త సకల విశ్వానికి అని ప్రగాఢంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేయడమే నేటి తరం కర్తవ్యం.

అందుకో అందుకో! అమరుడ జోహార్లు అందుకో..!
శ్రీశ్రీ జోహార్లు అందుకో..!


తేదీ: 15th Jun, 2009రచయిత: చందమామ

No comments:

Post a Comment