శ్రీశ్రీ సాహిత్య విశేషాలు

వీర ప్రేమికుడు శ్రీశ్రీ
 

రాయడం ఆవిడకి కొత్త కాదు. శ్రీశ్రీ గురించి రాయడం అసలేం కొత్తకాదు. వయసు వ్యత్యాసం, మానసిక వ్యవస్థానం వున్న రెండు భిన్న వ్యక్తిత్వాల కలయిక సరోజా శ్రీశ్రీ. ఆయన పాటల పుస్తకం ప్రచురణల్లోను, ఇతరత్రా శ్రీమతి సరోజ ‘శ్రీశ్రీ జ్ఞాపకాలను’ అక్షరబద్ధం చేస్తూనే వచ్చారు.
1956 ఆగస్టులో శ్రీశ్రీకి పరిచయం అయిన సరోజ డబ్బింగ్ చిత్రాల డైలాగ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ డైరెక్టర్‌గా శ్రీశ్రీకి అసిస్టెంట్‌గా పనిచేశారు. పరస్పర అవగాహనకది తొలిమెట్టు. ఆమె టాలెంట్‌ను అతను ప్రోత్సహించి, మార్గదర్శకుడై కలసి పనిచేసిన ప్రతి చిత్రానికి ‘‘మాటలు, పాటలు శ్రీశ్రీ’’ అని, డైలాగ్ డైరెక్షన్ యు.(ఉపద్రష్ట) సరోజ అని టైటిల్స్‌లో వేయించేవారు.
‘‘1956 నుండే జీవిత విశేషాలు రాయమని అడిగారు. నీకు తోచినట్టు యధార్థాన్ని మాత్రం- నీ ఇష్టం వచ్చినట్లు రాసేయ్ సరోజా.. అని ఉత్సాహపరిచి 1979లో నాచేత శ్రీకారం చుట్టించారు...’’ అని ఈ పుస్తకం ముందుమాటలో రాశారు సరోజ. అలా సాగి, ఆగి, 1984లో శ్రీశ్రీ మరణానంతరం కొనసాగింపును పునఃప్రారంభించిన ఈ అనుభవసారం 426 పేజీల ‘శ్రీశ్రీ సంసార ప్రస్థానం’గా గ్రంథ రూపం దాల్చిన శ్రీరంగం శ్రీనివాసరావ్ కుటుంబ జీవిత విశేషాలివి.
‘‘వేళకాని వేళలలో/ లేనిపోని వాంఛలతో/ దారికాని దారులలో/ కానరాని కాంక్షలతో/ దేనికొరకు పదే పదే/ దేవులాడుతావ్?/ ఆకటితో అలసటతో/ ప్రాకులాడుతావ్?/ శ్రీనివాసరావ్...’’ అని మహాప్రస్థానంలోని ‘దేనికొరకు?’ ఖండికలో శ్రీశ్రీ రాసిన పంక్తులకు ఆయన వ్యక్తిగత (్ళ్యశచిజజూళశఆజ్ఘ) జీవితంలోని విభిన్న కోణాలనుండి సమాధానంగా నిలుస్తుంది ఈ సంసార ప్రస్థానం.
‘ఈ శతాబ్దినాది’ అని సగర్వంగా చాటిన ఒక సాహితీ సాహసవీరుడి ప్రేమికురాలిగా, రెండవ భార్యగా, అతని నలుగురు పిల్లల తల్లిగా, స్వతంత్ర భావాలు, ప్రత్యేక ఆలోచనా సరళి వున్న రైటర్‌గా, అనువాదకురాలిగా సరోజా శ్రీశ్రీ ఒక జవాబ్దారీతో ఈ రచన చేశారనిపిస్తుంది. తన మనోభావాలు, కవి మనోగతాలు, బలహీనతలు ఏవీ దాచడానికి ప్రయత్నించలేదు.
ప్రపంచ బాధ తనదిగా విప్లవించిన అసాధారణ ప్రతిభాశాలి జీవన సహచరిగా సమాజాన్ని, కుటుంబంలోని మానవ సంబంధాల్ని, సవాళ్లను ఎదుర్కొంటూ చివరంటా శ్రీశ్రీతో పెనవేసుకున్న సరోజ అనురాగ బంధానికి రీడబిలిటీ ఉన్న కథనం.
సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్ల జీవితాల్లోకి తొంగి చూడాలన్న ఆసక్తి పాఠకులకి, ప్రేక్షకులకి వుండడం సహజం. కానీ కవిత్వంతో, సినీ గీతాలతో, విప్లవాభ్యుదయ ఉద్యమస్ఫూర్తితో ఆధునిక సాహిత్య చరిత్రలో చెరగని ముద్రవేసిన శ్రీశ్రీ నిజజీవిత విశేషాలను, నిజాయితీ, నిబద్ధలతో కూడిన బలహీనతల్ని, అనేక ఇతర అంశాలను, అన్నింటికీ మించి వీర ప్రేమికుడిగా శ్రీశ్రీని తెలుసుకోడానికి- అంతటి ఆసక్తీ వున్న తెలుగు పాఠకులకోసం అందించిన లైఫ్ స్కెచ్ ఇది.
కాగా ముద్రా రాక్షసాలో! ముదిత (సరోజ) మదిలోని అలజడి వలన కలం రాల్చిన అంకెల తప్పులో గాని ‘అంతిమ పోరాటంలో శ్రీశ్రీ’ ఖండిక (పేజీ 417) లోని తేదీలు (1-4-1993), (2-5-1984) వంటి తేదీలు రాసిన సందర్భాల్లో శ్రీశ్రీకి పునర్జన్మనిచ్చినందుకు సంతోషించాలో! 15-6-1983వ తేదీన ఆయన పోవడం అబద్ధం అనుకోవాలో! తెలియని అయోమయానికి గురిచేస్తాయి పాఠకుల్ని.
ఇలాంటి వాటి మాట ఎలా వున్నా ఇందులో సరోజ శ్రీశ్రీ గురించి, విడివిడిగా ఇద్దరిమీదా వున్న అనేక అపోహలకి తెరదించే కథనాలున్నాయి. శ్రీశ్రీని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న బలరాం (నాకు తెలిసిన శ్రీశ్రీ)తోబాటు, అనేక సందర్భాల్లో ఆపద్బాంధవుడయిన బలరాంకోసం కొన్ని పేజీలు కేటాయించడం ఔచిత్యభరితంగా వుంది.
‘‘చంద్రునికో నూలుపోగన్న/ సామెత ఉండనే వుంది/ తీసుకో ఈ దారంలాంటి/ తేలికైన గీతాన్ని...’’అని ‘ఖడ్గసృష్టి’లోని ‘శరశ్చంద్రిక’లో అంటారు శ్రీశ్రీ. కానీ ‘‘శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ‘చంద్రునికి నూలుపోగు’ అన్నట్టు ఈ శ్రీశ్రీ సంసార ప్రస్థానం’’ అంకితం ఇచ్చిన సరోజా శ్రీశ్రీ తన రాగద్వేషాలను, భావోద్వేగాలను, జీవన మానస సంఘర్షణలను, పరాభవాగ్నిని, ప్రశంసాజల్లులను వగైరా అక్షరీకరించిన ఈ ప్రస్థాన ‘గీతం’ అంత ‘తేలికైన దారం’కాదు. సరోజని, శ్రీశ్రీని ఒక ‘సూత్రం’తో బంధించిన గాఢానుభూతి. శ్రీశ్రీ బయోగ్రఫీగా, సరోజ ఆటోబయోగ్రఫీగా రూపొందింది. శ్రీశ్రీ గురించి ఎవరికీ తెలియని ఎన్నో అద్భుత విషయాల్ని సోదాహరణంగా ఆవిష్కరించింది. ఏ కవి సతీమణీ చేయని విధాన రచన చేసిన సరోజాశ్రీశ్రీ ‘మహాకవి మరణానంతర విశేషాలను ఫొటోలతో సహా ‘‘శ్రీశ్రీ అంతిమయాత్ర విశేషాలు’’ అన్న పేరుతో మరో పుస్తకం త్వరలో విడుదల కాబోతున్నదని ప్రకటించడం అదనపు ఆకర్షణీయాంశం.
శ్రీశ్రీ సంసార ప్రస్థానం
సరోజాశ్రీశ్రీ

వెల: రూ.200/-
ప్రతులకు:
విశాలాంద్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు.
-------------------------------------------

- కె.బి.లక్ష్మి