నవ కవనానికి నూరేళ్ళు


మహాకవి శ్రీశ్రీలో ఓ శ్రీ
శ్రీశ్రీ తదనంతర, ఆధునికానంతర సాహిత్యం కూడా శ్రీశ్రీ వారసత్వ స్రవంతిలో అంతర్భాగమేనని,దాని స్వంత అస్తిత్వాన్ని అంతర్ధానం చేయాలని చూస్తున్నారు. గత కాలపు కులాతీతవాద చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోకపోగా దాన్ని వర్తమాన చారిత్రక తప్పిదంగా కొనసాగిస్తూ ప్రస్తుత ప్రతిబంధక శక్తులుగా తయారైనారు.

srisriమహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలు ముగిసిపోయాయి. ఘనమైన ఆయ న నవకవన శకం ఆయన జీవితకాలంలోనే ముగిసింది. ‘మహా ప్రస్థా నం’ తో ఆరంభమైన తన మహానదీ ప్రవాహానికి తన ‘మరో ప్రస్థానమే’ ఉపనది గా మారిపోయిందని గ్రహించాడు. ఈ శతాబ్ది నాది అన్న శ్రీశ్రీయే తన మాటను వెనక్కి తీసుకొని, ఆరుద్రకు ఇచ్చిన వారసత్వ వాగ్దానాన్ని వెనక్కి తీసుకొని రాబోవు కాలం తనది కాదని, రాబోవు దూత ల్ని శివసాగర్‌లో చరబండరాజులో, గద్దర్‌లో చూస్తున్నానని స్వయంగా ప్రకటించారు. తన ను అధిగమిస్తూ ముందుకు వెడుతున్న నవ్యా తి నవ్యతరాన్ని నిర్మొహమాటంగా అనున యించారు. గతం గతహా అన్నట్లు ఈ గతం గురించి మళ్లీ మళ్లీ పదేపదే చర్చలెందకు, విమర్శలెందుకు అని కొందరికి అనిపించవ చ్చు. అది సహజం కూడా. అప్పటికాలపు యుగకర్తల గురించి, మహాకవుల గురించి, ఇప్పటి కాలపు చైతన్యంతో విమర్శించటం వృధా ప్రయాస అని ఓ సందర్భంలో కొడవటిగంటి కూడా వ్యాఖ్యానించారు.

అయితే అప్పటికాలపు కవి తా దృక్పథంలో ఇప్పటి కాలపు కవితా ప్రగతికి, పురోగతికి ప్రతిబంధకంగా ఉన్న అంశాలేమైనా ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దుకోవటం తప్పని సరి అని కూడా ఆయనే అభిప్రాయపడ్డారు. ఇప్పటి కాలానికే కాదు అప్పటి కాలానికి ప్రతిబంధకమైన దేదయినా ఉంటే అప్పుడలా ఎందుకు జరిగిందో చర్చించవచ్చని స్వయంగా శ్రీశ్రీయే ‘చరిత్ర పరిణామాన్ని వేగవంతం చేయటంలో ఓ కవి ప్రదర్శించిన శక్తికి కారణాలను, సమకాలీన చైతన్యంతో ఆ కవి కలిసి నడవలేక పోయి ఉంటే అందుకు మూలాలను నిర్మ మకారంగా విశ్లేషించగలగాలి’ అన్నారు. కనుక సుప్రసిద్ధ బ్రిటి ష్‌ చరిత్రకారుడు ఇ.హెచ్‌. కార్‌ వ్యాఖ్యానించినట్లు ‘వర్తమానం వెలుగులోనే గతాన్ని బాగా అవగతం చేసుకోగలుగుతాం. గతం వెలుగులోనే వర్తమానాన్ని మరింత బాగా అవగతం చేసుకోగలుగుతాం. గతానికి వర్తమానా నికి మధ్య జరిగే అనంతమైన సంభాషణే చరిత్ర’ అన్నాడు.

ఈ చారిత్రక దృష్టితో పరిశీలించినపుడు ఓ పాత్రికేయుడు వ్యాఖ్యానించినట్లు ‘శ్రీశ్రీ నీ వెళ్ళిపోయాక జీవనదుల్లో చాలానీరు ప్రవహించింది. తెలుగు సాహి త్యంలో సైతం మహాకవులకు, యుగ కవులకూ కాలం చెల్లిన కాలం వచ్చింది. ప్రేక్షక ప్రాయులుగా ఉన్నవారు వేదికలను ఆక్రమించే మనోహర దృశ్యం అన్నివైపులా వ్యాపించింది. నీకు దృశ్య మాత్రం కాని మహా సామాజిక సంచలనం దిక్కులను ఊపేస్తున్నది. తెలుగు అక్షరం పొడవు వెడల్పు లోతు చాలా పెరిగాయి. అనేకానేక మహాకావ్యాలూ, ఉద్గ్రంధాలు, స్మృతులూ, కాల నాళికలోకి జారిపోయాయి. అయినా ఆనాటి కవిగా, మహా కవిగా నువ్వు చిరస్మ రణీయుడవే. నీ మహాప్రస్థానం చరిత్రాత్మకమైనదే.

కనుక సాహిత్య ప్రపంచం మాత్రం నిన్ను మరిచిపోలేదు. కానీ నిన్ను తడిమి చూస్తున్నది. నీ కొలతలు తీస్తున్నది. నిన్ను పెదాలపై, జపిస్తూనే నువ్వింకా పాతబడవేమని నిలదీస్తుంది. అయినా నువ్వవసరం లేని కాలం కోసం బహుశా నువ్వు కూడా ఎదురుచూస్తూ వుంటావు’ అన్నారు. కానీ ఆయన పై తమకే పేటెంట్‌ రైట్స్‌ ఉన్నాయని వాదించే విప్లవ శిబిరం పీఠాధిపతులు మాత్రం శ్రీశ్రీ మళ్ళీ పుట్టడని ఇప్పటి కాలానికి కూడా ఆయనకి సాటి రాగల మేటి శిష్ట జనరంజక కవి మరొకరెవరు ఇంతవరకూ పుట్టలేదని, ఆయనే ద్రష్ట, ఆయనే సృష్ట, ఇప్పటికీ మహాకవిగా ఆయన కాయనే పరాకాష్ఠ అని ఈ కాలాంతకులు శ్రీశ్రీని కాలాతీత మహాకవిగా పునరుద్ధరించే పునర్మిర్మాణ ప్రక్రియకు పూనుకొన్నారు.

అంతేకాదు, అప్పటి కులాతీతవాద మహాకవి శ్రీశ్రీయే ఇప్పటి కుల అస్తిత్వ వాద మహాకవిగా మళ్లీ పుట్టాడన్నట్లు మాట్లాడుతున్నారు. అప్పటి సాలెల మగ్గం, జాలరి పగ్గం, కుమ్మరి చక్రం లాంటి కులవృత్తుల ప్రస్తావనలో ఆనాటి శ్రీశ్రీకి ఈనాటి కుల అస్తిత్వ స్పృహ ఉందని బుకాయించాలని చూస్తున్నారు. బర్రెపడ్డ ఎక్కడ పుట్టినా, ఎక్కడ కట్టినా తమ దొడ్లోనే ఈనాలన్నట్లు, ఏదైనా తమ శంకులో పోస్తేనే తీర్థం కావాలన్నట్లు తమ గుత్తాధిపత్య పీఠాలు చెక్కు చెదరకుండా ఉండాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీశ్రీ తదనంతర, ఆధునికానంతర సాహిత్యం కూడా శ్రీశ్రీ వారసత్వ స్రవంతిలో అంతర్భాగమేనని, దాని స్వంత అస్తిత్వాన్ని అంతర్ధానం చేయాలని చూస్తున్నారు. గత కాలపు కులాతీతవాద చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోకపోగా దాన్ని వర్తమాన చారిత్రక తప్పిదంగా కొనసాగిస్తూ ప్రస్తుత ప్రతిబంధక శక్తులుగా తయారైనారు.

కనుక శ్రీశ్రీ ఎంత గొప్ప విప్లవ కవి అయినా,ఎంత చిరస్మరణీయుడైనా ఆయ న మన దేశ కుల-వర్గ పీడితులందరికీ ఆమోదయోగ్యమైన వారు కాదు, స్పూ ర్తిదాయకమైనవారు కాదు అని స్పష్టం చేస్తున్నాం. అలాగే శ్రీశ్రీ కవితా ప్రస్థానం ఎంత శిష్ట జనరంజక మహాప్రస్థానమైనా అది దళిత బహుజన శ్రామిక వర్గ- కుల మహాజన ప్రస్థానం కాదని, కుల-వర్గ పీడితులుందరికీ అందులో స్థానం లేని ఆ కులమిధ్యావాద మహాప్రస్థానం పాక్షికమైన ఒంటిచేతి చప్పుడేనని చెప్ప కనే చెపుతున్నాం. అందుకే అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు, ఆనాటి చీకటి కోణాలన్నీ వెలుగులోకి తేవాలిప్పుడు, చరిత్ర తిరగరాయాలిప్పు డు. దాచేస్తే దాగదు సత్యం.

దాటేస్తే సాగదు నిత్యం అని తెగేసి చెపుతున్నాం.కనుక ఆనాటి దళిత బహుజన కుల అస్తిత్వవాద అజెండాని ప్రక్కదారి పట్టించిన కుల అతీత వాద ఎర్ర జెండా ‘వర్గీ’యుల వర్గ కుదింపువాద చారిత్రక తప్పిదాన్ని ఈనాటి కుల అస్తిత్వ వాద శకంలో నైనా ఒప్పుకొని సరిదిద్దాలి. ఈ దేశ సామా జిక ప్రజాస్వామ్య విప్లవం. ఓ జీవితం కాలం లేటు కావడా నికి, చేటు కావడానికి కారణమైన వారే, వారి సాహిత్య సాంప్రదాయాన్ని వారసత్వంగా స్వీకరించినవారే అందుకు జావాబుదారీ తనం, బాధ్యత వహించాలి. సప్తవర్ణ కాంతుల తో తెలుగు సాహిత్యాన్ని కాంతులీనేలా కాంతివంతం చేసిన వర్గేతర నూతన సామాజిక సాహిత్య అస్తిత్వ ఉద్యమాలు వెల్లువెత్తిన వర్తమాన దశలో వచ్చిన శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాల సందర్భంలోనైనా శ్రీశ్రీ కులాతీతవాద సాహిత్య కోణంపై దృష్టిసారించి చర్చించి ఉండాల్సింది. కానీ ఆపని జరగకపోగా దాటివేత ఎత్తుగడలతో దృష్టి మళ్ళించటం జరిగింది.

అంతేకాదు వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అన్నట్లు ఆనాటి శ్రీశ్రీ కులాతీత వర్గవాద సాహిత్యంలోనే ఈనాటి దళిత బహుజనవాద స్త్రీవాద, తెలంగాణ ప్రాంతీయ వాద, ఆదివాసీ వాద వర్గేతర సామాజిక అస్తిత్వవాద స్రవంతులన్నీ మిళితమైనాయని మభ్యపెట్టే దుస్సాహానికి ఒడిగొట్టడం జరిగింది. ఈ దుర్మార్గాన్ని తిప్పికొట్టడం కోసం మేమే స్వయంగా శ్రీశ్రీ సాహిత్యంలోని కులాతీత వాద చీకటి కోణాన్ని వెలికితీసి కుల అతీతవాదానికి కుల అస్తిత్వవాదానికి మధ్య స్పష్టమైన విభజనరేఖ గీచి- దాచేస్తే దాగదు సత్యం, దాటిస్తే సాగదు నిత్యం అని చాటి చెప్పాలనుకొంటున్నాం. శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానంలోని సానుకూలాంశాన్ని విమర్శనాత్మకంగా స్వీకరించి ప్రతి కులాంశాన్ని స్పష్టంగా తిరస్కరించాలనుకొంటున్నాం.

పాత్రికేయుడు అన్నట్లు ఆనాటి శ్రీశ్రీ తన కాలపు సమకాలికులకంటే - ‘చాలా ముందుకు చూడగలిగారు కానీ కులపరమైన వర్గేతరమైన - కొన్ని పార్శ్వాలను కన్ను తెరిచి చూడలేకపోయారు. కొన్నింటికి చెవి యోగ్గి వినలేక పోయాడు. కాలాన్ని దాటగలిగిన జ్ఞానులు కూడా సర్వకాలాతీతులు కారని నిరూ పించారు. అలాగే ‘కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలని, కొత్త సమాధా నాలు సరికొత్త సిద్ధాంతాలు కావాలని’ ప్రశ్నల్ని ఝళిపిస్తూ రంగస్థలాన్ని ఆక్ర మించుకొంటున్న కొత్త సామాజిక అస్తిత్వ శక్తులు తన అక్షరాలకు ఎన్ని మార్కులు వేస్తాయో అని మాత్రం భయం భయంగా, వినయంగా మహాకవి శ్రీశ్రీ ఎదరుచూస్తున్నారు’. అందుకే ఆ శక్తులకు ప్రాతినిధ్యం వహించే వారి తర పున మహా కవి శ్రీశ్రీలోని ఓ ‘శ్రీ’ ని సానుకూలంగా ఎందుకు చూస్తున్నామో స్పష్టం చేస్తున్నాం.

కవి తత్వానికి, కవి కవిత్వానికి అవినాభావ సంబంధం ఉన్నట్లే మహాకవి శ్రీశ్రీ పేరుకి, ఆయన కవితా నిర్మాణ తీరుకి కూడా అవిభాజ్య సంబంధం ఉంది. ఆ రెండిలో పరస్పర సంబంధం గల క్లుప్తీకరణ ఓ విలక్షణ వ్యక్తీకరణగా అక్షరాక్షరానా సాక్షాత్కరిస్తుంది. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని అలవో కగా పలికించే శబ్దార్థ అనుశాసనుడైన శ్రీ శ్రీ కవితా ప్రస్థానంలో నిక్షిప్తమైన వున్న ఈ సంక్షిప్తీకరణ భావ వ్యక్తీకరణనని కూడా క్లుప్తీకరిస్తుంది. అందుకే తన హృదయం ఎలా కంపిస్తే అలా ఆ కంపనలకి ఆ హృదయానుభూతికి తగ్గట్టుగా మాటల రూపాన్ని ఇవ్వటం శ్రీశ్రీకే తెలుసంటాడు చలం. ఆ సూటైన మాటల్ని తూటాలుగా, కత్తులు, కటార్లుగా భగభగ మండే మంటగా మార్చటం శ్రీశ్రీకే చేతనవునంటారు చలం. కవికి కవిత్వానికి సమన్వయం కుదిరిందాకా, కవికి - ప్రపంచానికి సంయోగం కుదిరిందాకా, బాధాసర్పదృష్టుల బాధ తన బాధగా ప్రపంచ ప్రజల బాధ తన బాధగా అనుభూతి చెందేదాకా కవి చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావ అంతర్మధన ఫలితమే కవిత్వం, అది ఎంతగా మధిస్తే అంత గొప్ప కవిత్వం, అందుకు ఉదాహరణే శ్రీశ్రీ మహాప్రస్థానం అంటారు చలం.

ఒక్కమాటలో కవి జీవితంలో, కవిత్వంలో, భాషల్లో, భావాల్లో క్లుప్తీకరణ ఓ విలక్షణ వ్యక్తీకరణగా ఉండకపోతే అది దేశభక్తి లేకపోవటమంత అపరాధమంటాడు చలం. అందుకనుగుణంగా పతితులార, భ్రష్ఠులార, బాధా సర్పదృష్ఠులార ఏడవకండేడవకండి, నేనున్నా, నేనన్నా అని భరోసా ఇస్తూ; పదండి ముందుకు పదండి తోసుకు అని తాను మందు నడుస్తూ తనతో పాటు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాడు శ్రీశ్రీ. బాధితుల విమోచన కోసం రెక్కల గుర్రానెక్కించి కొత్త బంగారు భవిష్యత్తు స్వప్నలోకా ల్లోకి తీసుకెడుతూ, దాన్ని సాధించే సామ్యవాద విప్లవ రక్తపాతసహిత యుద్ధంలోకి ఉరికిస్తూ, హరోం హరోం హర హరిహర హరిహర అంటూ ఉర్రూతలూ గించే ‘దీర్ఘశ్రుతి’లో హోరెత్తించే ‘తీవ్రధ్వని’తో ఉరకలెత్తించే ఉత్తేజంతో కవితా కవాతు చేసే కాల్ప నిక, కళాత్మక, సృజనాత్మక, ఆశ్చర్యార్ధక, అద్భుత లోకాల్లోకి ఆహ్వానించే ఆధునిక విప్లవ కవితా వైతాళి కుడే మహాకవి శ్రీశ్రీ.

అందుకే మహాప్రస్థానం చదువు తుంటే ‘ఇవి మాటలు కావు, అక్షరాలు కావు, ఉద్రేకాలు, ఉత్తేజాలు, బాధలు, యుద్ధాలు- శ్రీశ్రీ హృదయంలోంచి మన హృదయాల్లోకి డైరెక్టుగా పంపిన ఉత్సాహాలు, నెత్తుటి కాలువ అనిపిస్తుంది. ఒక్కమాటలో నెత్తురు కన్నీరు కలగ లపి కొత్తటానిక్‌ తయారుచేశారు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచాన్ని (కాలం చెల్లిన మధ్యయుగాల నాటి వ్యవస్థను) మార్చటానికి’ అన్నారు చలం.
సామ్యవాద విప్లవ యుద్ధ భేరికి దీటైన శబ్ద భేరితో, సవ్య సాచిలా సాధించిన ఈ వస్తు రూప సమ్మేళన కవిత్త్మాక సమతుల్యతే అవినాభవ అవిభాజ్య సంబంధమైన శ్రీశ్రీని గౌరవప్రదమైన మహాకవిగా మహోన్నత స్థానంలో నిలబెట్టింది. ఆ రకంగా, ఆ కోణంలో ఆ నాటి శ్రీశ్రీకి ఆ గౌరవం దక్కడం అస మంజసం కాదు, అనివార్యం.

                                  అత్యద్భుత భావావేశం, అత్యాధునిక కవితావేశం, అత్యున్నత సామ్యవాద విప్లవ సందేశం ఒకే వ్యక్తిలో త్రివేణీ సంగమైమై సరికొత్త సాహిత్య చరిత్రని సృష్టించిన మహాకవి శ్రీశ్రీ తన కాలపు సమకాలికుల్లో అగ్రగణ్య ఆధునిక మహాకవిగా కీర్తి శిఖరాల నధిరోహించటమే కాక ఆధునిక తెలుగు సాహిత్యానికి కూడా ఘనకీర్తి సాధించిపెట్టారు. అలా ఒక శ్రీ ని సార్ధకం చేసుకున్నారు. మహాకవి శ్రీశ్రీ పేరులో రెండు ‘శ్రీ’ లున్నట్లే శ్రీశ్రీ కవిత్వంలోను రెండు లక్షణాలున్నాయి. ఈ రెండు లక్షణాలకి కూడా అవిభాజ్యమైన అవినాభావ పరస్పర సంబంధ బాంధవ్యం ఉంది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా శ్రమైకజీవన సౌందర్యానికి పట్టం కట్టి సాహిత్య రంగం లో కార్మికవర్గ అంతర్జాతీయ ప్రాపంచిక వర్గ దృక్పథానికి శ్రీకారం చుట్టాడు. ఇది ఒక లక్షణం. అదే సమయంలో దళిత బహుజన పీడిత కులాల కుల అస్తిత్వవాద సామాజిక దృక్పథాన్ని చేపట్టకుండా కులాన్ని విస్మరించి వర్గాన్ని స్మరించే (వర్గానికి పరిమితమయ్యే) కులాతీత వర్గ వాదానికి కూడా శ్రీశ్రీయే శ్రీకారం చుట్టారు.


u-sambasivarao- సత్యశోధక సామాజిక కేంద్రం, కన్వీనర్‌
ఉ.సా.


మరో ప్రపంచపు మేల్కొలుపు
Sri-Sri-very-good
గురజాడ ఆధునికాంధ్ర కవిత్వానికి తన ముత్యాల సరాల మాత్రా ఛందస్సుతో ఒక కొత్త మెరుపు మలుపునిస్తే శ్రీశ్రీ దాన్ని తన ‘మహా ప్రస్థానం’ గీతాలతో మరింత వెడల్పు చేసాడు. శ్రీశ్రీ తన కవితా ప్రస్థానంలో దీక్షతో ఉత్సాహంతో ఉద్రేకంతో ఉద్యమిస్తూ ముందుకు చొచ్చుకు పోయాడు.


అమెరికాలోని ఆర్థికమాంద్యం విశ్వవ్యాప్తమైన కారణంగా చరిత్రకారులు 1930-40 వరకు కొనసాగిన దశాబ్దానికి ‘క్షుదిత ముప్పయిలు’ అని నామకరణం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు ప్రారంభమై రణభేరి మోగింది. ఈ దశాబ్దంలోనే అభ్యుదయ రచయితల సంఘం (ఇండియన్‌ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌) మేనిఫెస్టో లండన్‌లో విడుదలయింది ఈ కాలంలోనే. శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ లోని గీతాలు కూడా చాలా మట్టుకు ఈ చారిత్రక నేపథ్యంలోనే వచ్చాయి.

ఈ పరిణామాల పృష్ఠ భూమికలో వాస్తవిక పరిస్థితులన్నింటికీ కవితాత్మకంగా స్పందించినా, సామాజిక వాస్తవికతకి వెన్నుదన్నుగా మార్క్సిజం అనే దార్శనికత జాగురుకతతో నిలిచిందనే నిజం అప్పటికి తనకీ తెలియదని శ్రీశ్రీ ఒక సందర్భంలో తానే చెప్పుకున్నాడు. గురజాడ ఆధునికాంధ్ర కవిత్వానికి తన ముత్యాల సరాల మాత్రా ఛందస్సుతో ఒక కొత్త మెరుపు మలుపునిస్తే శ్రీశ్రీ దాన్ని తన ‘మహా ప్రస్థానం’ గీతాలతో మరింత వెడల్పు చేసాడు. శ్రీశ్రీ తన కవితా ప్రస్థానంలో దీక్షతో ఉత్సాహంతో ఉద్రేకంతో ఉద్యమిస్తూ ముందుకు చొచ్చుకు పోయాడు.

స్వప్నలోకంలోని అందమైన అబద్ధాల కన్న వాస్తవిక జగత్తులోని నిష్ఠురమైన నిజంలోనే మంచి కవిత్వం దృశ్యమానమవుతుందని శ్రీశ్రీ విశ్వసిం చాడు. అందువలన ‘మహా ప్రస్థానం’ గీతాలలో గమ్మత్తయిన స్వాప్నిక జగత్తుకాక నిష్ఠురమైన సామాజిక వాస్తవికతకు దర్పణం దర్శించడమ యింది. ‘కనబడలేదా మరో ప్రపంచపు/ అగ్ని కిరీటపు ధగధగలు/ ఎర్రబావుటా నిగనిగలు/ హోమ జ్వాలల భుగభుగలు/ నెత్తురు మండే శక్తులు నిండే/’ యువతని ఆ మరో ప్రపంచం లోనికి ఆహ్వానిస్తున్నప్పుడు సామ్యవాద వాస్తవికత ఒక కలల మరో ప్రపంచంగా మిగిలిపోయింది.

పెట్టుబడిదారీ గుంటనక్కల పెద్ద పెద్ద కుట్రలు, వాటికి వత్తాసు పలికే సాహిత్యంలోని సాంప్రదాయం- వర్గరహిత సమసమాజ స్థాపనకు వ్యవస్థీకృత అవరోధాలుగా శ్రీశ్రీ అవలోకించాడు. అందుకనే తన సృజనాత్మక శక్తులన్నింటిని కేంద్రీ కరించుకుని వాటిపై ఒక ఝంఝా మారుతంలా, ఒక సునామీలా విరుచుకుపడ్డాడు. మార్క్సిజం సైద్ధాంతిక ప్రభావం వివశుణ్ణి చేస్తూ శ్రీశ్రీకి జీవితాన్ని విమర్శించే వివేచనా దృష్టిని సమాజ పరిస్థితుల వెనుక ఉండే అగాథ నిగూఢ రహస్యాలను అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించింది.శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ రచనా కాలం నాటికి విశ్వ సాహిత్యంలో అధిభౌతిక, అధివాస్తవిక ధోరణులు చోటు చేసుకున్నాయి. భావ కవిత్వ ధోరణి నుంచి బయటపడి శ్రీశ్రీ మరో ప్రపంచంలోనికి సాగించే మహా ప్రస్థానంలో ‘అధివాస్తవి కత’ను ఒక మజిలీగా ఉపయోగించాడు. అస్తవ్యస్థంగా ఉన్న వ్యవస్థను గురించిన వాస్తవిక చిత్రణకి, సామాజిక శక్తులలో ఒక కొత్త మేల్కొలుపునకు శ్రీశ్రీ అధివాస్తవికతను ప్రయోజనాత్మక శిల్ప విశేషంగా ప్రయోగించాడు.

మానవ సంబంధాల విలువలను పునఃప్రతిష్ఠించడానికి, జన బాహుళ్యాన్ని మేల్కొల్పడానికీ, అణగారిన సమతా నియతని నెలకొల్పే భాద్యతను గురించి గుర్తు చేయటానికి శ్రీశ్రీ అభ్యుదయ పద్ధతిలో విప్లవ పంథాకు ఆధునికాంధ్ర సాహిత్య స్రవంతిని మళ్ళించాడు. తెలుగు సాహిత్యంలో సాంప్రదాయక దృక్పధం స్థానంలో లౌకిక వాస్తవిక దృక్పధాన్ని ప్రవేశపెట్టాడు. 1928లో భావకవితా ప్రతిభను కృష్ణ శాస్ర్తి ప్రభావానికి వశీభూతుడై ప్రదర్శించిన తర్వాత 1933 వరకు అయిదేళ్ళు అభ్యుదయ కవితాసృష్టికి కీలకమైన పురిటి నొప్పులు, మూగవేదన అనుభవిం చాడు. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో పాసిస్ట్‌ ఫ్రాంకో ఓటమిని, ప్రజాస్వామ్య శక్తుల విజయాన్ని కోరుకుంటూ అభ్యుదయ కవిత్వానికి అవతారికగా శ్రీశ్రీ ‘జయభేరి’ని ఇలా మోగించాడు.

‘నేను సైతం/ ప్రపంచాగ్నికి/ సమిధ నొక్కటి ఆహుతిచ్చాను/... నేను సైతం/ భువన భవనపు/ బావుటానై పైకి లేస్తాను...’ఆంగ్ల కవి విల్‌ ఫ్రెండ్‌ విల్సన్‌ గిబ్బన్‌ ‘ఐ, ఈవెన్‌ ఐ’నే (నేను, నేను సైతం) అనే ఎత్తుగడతో రచించిన గీతాన్ని చదివిన శ్రీశ్రీ ప్రతి ఒక్కరు కూడా లోకానికి ఏదో విధంగా తోడ్పడగలరనే అంతరార్థాన్ని గ్రహించి ‘నేను సైతం పాటు పడ్డాను- పాటు పడతాను’ అనే భావాన్ని చాటడానికి ‘జయభేరి’ గీతం రచించాడు. ‘మహా ప్రస్థానం’ గీత సంకలనానికి మొదటి గీతంగా ఇది ప్రభాత జయభేరిగా, మేల్కొలుపు పిలుపుగా మారుమోగింది. తాను చేయవలసిన పనులను తాను ఉడతా భక్తిగా చేస్తున్నట్లు ధ్వనిస్తూ చివరికి అందులోని ‘నేను’గా మారతాననే అశాభావాన్ని ప్రకటించాడు.

శ్రీశ్రీ కలలు కనిన ‘మరో ప్రపంచం’ అస్తిత్వం, స్వరూప స్వభావాల అవగాహన దాని భౌతిక సత్య నిరూపణలో నిబిడీకృతమై ఉన్నది. తాను అనుసరిస్తున్న కవితామార్గం ద్వారా ‘కార్మిక లోకం కళ్యాణానికి శ్రామికలోకపు సౌభాగ్యానికి’ పాటు పడడానికి ప్రయత్నించడం వలన అభ్యుదయ కవిగా విప్లవకవిగా శ్రీశ్రీ గుర్తింపు పొందాడు. కర్షక కార్మికులే దేశ సౌభాగ్య నిర్మా తలు కనుక ఘర్మజలానికి ఖరీదు లేదంటాడు.వ్యదార్థ జీవిత యదార్థ దృశ్యాలు పునాదులుగా భావి వేదాలు అవతరిస్తాయంటాడు. వాటి జీవ నాదాలే తన రచనలన్నాడు. ‘పొలాల నన్నీ/ హలాల దున్నీ/ ఇలా తలంలో హేమం పిండగ/ జగానికంతా సౌఖ్యం నిండగ’ ‘ప్రతిజ్ఞ’ కవితలో ని ఈ భావం సామాజిక చైతన్యానికి ప్రతీక. ‘ప్రతిజ్ఞ’లో కావ్య శిల్పం, విప్లవాత్మకమైన విలువల సమ్మేళనం ఆ రచనను ఒక రసవత్కా వ్యంగా రూపొందించింది.ఆకలేసి కేక వేశానని, కవిత్వమొక తీరని దాహమని శ్రీశ్రీ కావ్య ప్రయోజనాన్ని నిర్వచించాడు.

సాహిత్యంలో నిజాయితీని గొప్ప సుగుణంగా చేసుకుని ఆచరణలో నిరూపించుకున్నాడు శ్రీశ్రీ. అభ్యుదయ కవిత్వం 1933లో ప్రారంభ మైనా, శ్రీశ్రీ సాహిత్య దృక్పధం కేవలం కవిత్వ భావనను ఆశ్రయించుకునే కొంతకాలం సాగింది. కవిత్వ విశ్వరూపాన్ని శ్రీశ్రీ దర్శించా డు. కవిత్వానికి సార్వకాలిక లక్షణాలు ఉండవని చెప్తూ ‘సర్వజన రంజకత్వం మరు మరీచిక కాబట్టి నా హృదయం మీద ప్రతి గీతాన్ని పెట్టుకుని చూస్తాను. ఏ మాత్రం స్పందన తోచినా ప్రకటిస్తాను. ఇంతకంటే మరో ప్రామాణ్యం నేనంగీకరించడం నన్ను నేను మోసం చేసుకోవడం’ అంటాడు శ్రీశ్రీ. కవిత్వాన్ని పరికించటానికి హృదయ స్పందన కంటే వేరే ప్రమాణం ఆవశ్యకత లేదని అతని అభిప్రాయం.

‘తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావమే కవిత్వం’ అంటాడు చలం. తాను తనకు అంతర్‌ విషయం, ఈ ప్రపంచం తనకు బహిర్‌ విషయం. తనకు తానైనది ఆత్మ.తనకు బహిర్‌ విషయమైనది ప్రపంచం. అటు ఆత్మకి ఇటు ప్రపంచానికి మధ్య కవి ఉనికి. కవి అక్కడ లేకపోతే అటు ఆత్మ లేదు, ఇటు ప్రపంచం లేదు. ఆత్మ పదార్థం గురించి ప్రపంచానికి తెలియజేయడమే సామరస్యం కుదరటం. ఆ సామరస్యాన్ని కుదిరించటానిి చేసిన ప్రయత్నమే శ్రీశ్రీ కవిత్వ సాధన.‘నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్‌ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి’ అంటాడు చలం.శ్రీశ్రీ కవిత్వం ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్‌- అనగా ఆత్మపదార్థాన్ని తెలియజేయడం తప్ప తెలుసుకోవలసినది లేేదని అర్థం. ఆత్మ పదార్థంతో సమరస భావాన్ని పొందగలిగేటట్లు ప్రపంచానికి ప్రేరణ కలిగించటమే కవిత్వం పని. ఆ బాధ్యతని శ్రీశ్రీ తన మీద వేసుకున్నాడు.‘ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ’ అంటే శ్రీశ్రీలో సమష్ఠితోటే తాదాత్మ్యం ఉందని ధ్వని’. శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడన్న దానిలో ఉన్న తాదాత్మ్యం ‘కృష్ణశాస్ర్తి తన బాధను అందరిలోను పలికిస్తా’డనడంలో లేదు.

శ్రీశ్రీ ప్రపంచం యొక్క నిత్య జీవిత తత్త్వాన్ని చారిత్రక భౌతిక కోణాల నుండి దర్శిస్తే, కృష్ణశాస్ర్తి ఒక్క వియోగ దుఃఖాన్ని అస్పష్ట మధు రంగా దర్శించాడు. శ్రీశ్రీ దర్శనంలో ఈ కోణం కనబడదు. శ్రీశ్రీ కవిత్వం అభ్యుదయ పథంలో విశ్వజ నీనతను సంతరించుకుంటే కృష్ణశాస్ర్తి కవిత్వం కాల్పనిక భావ కవిత్వ పథం.శ్రీశ్రీ కవిత్వం జీవితం వడ్డించిన విస్తరిలా ఉన్నవారికి అర్థంకాదు. ఆత్మ చైతన్య వికాసం ఉంటేనే అది అర్థం అవుతుంది. సుఖ దుఃఖాలను అలా అనుభవిం చగలిగే ఆత్మ చైతన్యం సామాన్యులలో మేల్కొంటుంది కనుక వారికి శ్రీశ్రీ కవిత్వం యొక్క అవగాహన ఉంటుంది. ప్రపంచపు బాధల్ని తన బాధలుగా అనుభవించి మమైక్యం చెందిన శ్రీశ్రీని అలా దర్శించిన వారికే శ్రీశ్రీ కవిత్వం గురించి తెలుస్తుంది. ఈ తెలియక పోవడమన్నది కేవలం శ్రీశ్రీ కవిత్వానికే పరిమితం కాక, సమస్త అభ్యుదయ కవిత్వానికి వర్తింస్తుందనడంలో సందేహం లేదు. అర్థరాత్రి అలుముకున్న చీకట్లో లోకం గాఢ నిద్రలో పీడ కలలు కంటూ, పలవరిస్తూ ఉలిక్కి పడుతూ, ఇటూ అటూ అసహనంగా కదులుతున్నప్పుడు ఉషోదయాన్ని స్వాగతిస్తూ శంఖారావంతో లోకాన్ని మేల్కొలిపే వైతాళికుడు శ్రీశ్రీ.   ‘అనితర సాధ్యం నా మార్గం’, ‘నా వినిపించే నవగీతికి నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం’ అంటూ శ్రీశ్రీ తెలుగు కవిత్వానికి అభ్యుదయ కవితా మహా ప్రస్థానానికి కొత్త మార్గాన్ని ఏర్పరచి మరో ప్రపంచంలోనికి ఆహ్వానించాడు. ‘తిరగబడే వాడా! ప్రశ్నించేవాడా!’ అని ఉత్తేజపరుస్తూ, లోకంగో తాదాత్మ్యం చెంది అలజడి, ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటన, నిరంతర పోరాటం- ఇవే జీవితమని, ఊపిరి అనీ, వేదాంతం అనీ తత్త్వం అనీ శ్రీశ్రీ నిర్వచిం చాడు. మార్క్సిస్టు దృక్పధంతో చరిత్రను సమీక్షిస్తూ, చరిత్ర నుంచి ఉద్భవించే శక్తులు సామాజిక ధర్మాన్ని ఏ రీతిగా మారుస్తాయో, ఏ నిజాలు మనం గుర్తించాలో ‘ఏ దేశ చరిత్ర చూచినా/ ఏమున్నది గర్వ కారణం?/ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అంటూ ‘దేశ చరిత్రలు’ అనే కవితలో శ్రీశ్రీ తన విప్లవ గళం విప్పాడు.

నూరేళ్ళ శ్రీశ్రీ మహాసభలు విరసం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఏప్రిల్‌ 30 నుంచి మే 1 వరకూ జరుగనున్న సందర్భంగా....
 Mangu-Sivaram-Prasad
- మంగు శివరామ ప్రసాద్‌