Wednesday, June 16, 2010

శ్రీశ్రీతో ఎన్ని అనుభవాలో.. ఎన్ని జ్ఞాపకాలో..!

'నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-' అని శ్రీశ్రీ గురించి రాయబోతే చలం హెచ్చరిక వెక్కిరిస్తుంది. అయినా శ్రీశ్రీతో పరిచయం అయి, ఆయన కూడా పదిమందిలో కలిసినప్పుడో, ఉత్తరాల్లోనో పలకరించేంత పరిచయం పెరిగినాక, కలిసి పనిచేసే అవకాశం వచ్చినాక ఆయన గురించి అభిప్రాయం లేదా జ్ఞాపకాలు చెప్పకుండా ఉండడం అసాధ్యమనుకుంటాను.

పైగా ఆయన తన కవిత్వం అనే వ్యసనం ద్వారానే కాదు, అన్ని వ్యసనాల ద్వారా పబ్లిక్‌గా నిలబడ్డాడు. ఇవ్వాళ అరిగిపోయేలా వాడుతున్న మాట వాడాలంటే పారదర్శకంగా జీవించే పోయాడు. నవయువకులు కూడ తమ వ్యసనాల గురించి కవిత్వంలో, రచనల్లో ఇన్‌హిబిషన్స్ లేకుండా రాసుకునేంత సాహిత్య సంప్రదాయాన్ని నెలకొల్పి పోయాడు. అట్లని శ్రీశ్రీ చలం వలె, కాళోజీ వలె ధైర్యశాలి అని చెప్పడానికి రాయడం లేదు. తన బలహీనతలు కూడా దాచుకోలేని సామాన్యుడు అనిపిస్తుంది.

శ్రీశ్రీని మొదటిసారి నేను బి.ఎ. రెండవ సంవత్సరం (1958- 59)లో ఉండగా చూశాను. ఏదో సాహిత్య సభ కోసం హైదరాబాదు వచ్చాడు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజికి తీసుకువస్తాననే ధీమాతో హైదరాబాదుకు వచ్చాను. శ్రీశ్రీ, కాళోజీలను అభిమానించే చాలమంది, వాళ్లమీద తమకేదో హక్కు ఉన్నదని అనుకుంటారనుకుంటాను.

బుద్ధి తెలిసినప్పటి నుంచి వీరాభిమానిని, బిఎ మొదటి సంవత్సరంలోనే చేకూరి రామారావు అంతటివానితో 'తెలుగు స్వతంత్ర'లో శ్రీశ్రీ పక్షాన ఢీకొన్నాను. (ఇద్దరమూ వీరాభిమానులుగానే తలపడి పరిచయమయి మంచి స్నేహితులమయ్యాం.) నేను పిలిస్తే రాడా అన్నట్లు వచ్చాను (రాడు చూడు అని మా హితవరి జి.వి.సుబ్రహ్మణ్యం హెచ్చరించినప్పటికీ). ఆయన రానన్నాడు గానీ హైదరాబాద్‌లో సభకు ఆయన బయల్దేరే దాకా ఆయనను వింటూ, చూస్తూ, మధ్యమధ్యలో మా కాలేజికి రమ్మనే నా ఆహ్వానాన్ని ప్రాధేయపూర్వకంగా రెన్యూ చేస్తూ ఆయనతో మొదటిసారి గడిపాను. ఏభై ఏళ్లు అయింది.

ఆయన విషయంలో నాకు ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగించిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏమిటంటే ఆయన కూడా నా వల్లెనే తెల్లటి పైజామా, షర్టు వేసుకున్నాడు. మా ఎరుకలో శ్రీశ్రీని మొదటిసారిగా వరంగల్ కాలేజికి పింగళి రంగారావు తెలుగు సాహిత్య సమితి కార్యదర్శిగా 1962-65 మధ్యకాలంలో పిలిచాడు. అప్పుడాయన కాళోజీ ఇంట్లో దిగినప్పుడు ఉదయమే కలవడానికి వెళ్లాను. శ్రీశ్రీ, కాళోజీ ఇద్దరు బనీన్ల మీదనే ఉన్నారు. జనసేన ఆ ఇద్దరితో కలిసి నా ఫోటో తీసాడు.

ఫజిల్స్ నింపేప్పుడు, పుస్తకాలు చదివేప్పుడు తప్ప కుదురుగా కూర్చునేవాడు కాదు. గనుక తానున్న గదిలో పచార్లు చేస్తూ, ఆయన సిగిరెటు తాగే (స్టైల్ ఇప్పుడు ఆయన తెలిసిన అందరికీ తెలుసు గదా) క్రమంలో చిటికె వేస్తూ గదిలో కూర్చున్న వారితో మాట్లాడుతూ ఉంటాడు గదా. కనుక ఎవరు వచ్చినా ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించినట్లే ఉండేది.

కొందరు నిరాడంబరత్వం నిర్వహిస్తారు. కొందరికది సహజ స్వభావంగా ఉంటుంది. ఆహార్యం విషయంలో శ్రీశ్రీని చెప్పే మరెవరినయినా చెప్పాలి. ఎప్పుడయినా ప్రత్యేక సందర్భాల్లో ప్యాంటులోకి షర్ట్ టకప్ చేసి బెల్టు పెట్టుకునేవాడు. ఎం.వి.నారాయణరావు కిన్నెర సన్మానానికి వచ్చినపుడయితే సరోజగారు సిల్కు దుస్తులు వేసి తన పక్కన రైల్లో ఒద్దికగా కూచోబెట్టుకోవడం కాజీపేట రైల్వేస్టేషన్లో కలిసినప్పుడు చూసాం. కాని సాయంకాలం వరకల్లా పసిపిల్లలవలె ఆయనకా దుస్తులపై శ్రద్ధ ఉండదు.

ఆయన ఇంట్లో ఎక్కువగా తువ్వాల కట్టుకుని ఉండేవాడేమో గాని దిగంబర కవుల రెండు సంపుటాలు వెలువడిన తర్వాత 66లో ఆయనను మద్రాసులో కలిసినపుడు ఆ అవతారంలోనే ఉన్నాడు. ఎంతో ఉత్సాహంగా దిగంబర కవిత్వానికి ఆహ్వానం పలుకుతూ, 'చెరచబడ్డ గీతాన్ని' ఇంగ్లిష్‌లోకి తను చేసిన అనువాదాన్ని చదివి వినిపించాడు. చైనా ప్రయాణం చేసి తిరిగి వచ్చాక హైదరాబాద్ హోటల్ రూంలో కలిసినపుడు అట్లాగే ఉన్నాడు. హోటల్‌వాళ్లు ఇచ్చే టర్కీ టవల్ చుట్టుకొని.

చైనా పర్యటనలోనే మొదటిసారి ఆయనతో ఉన్న బెంగాలీ రచయితలకు ఆయన తాగుతాడని తెలిసిందట. అది అక్కడ చాల ప్రచారమైపోయింది. మనస్తాపమో, మరేమి కారణమో తెలియదుగానీ అపుడాయన తాగడం మానేసి(1978) ఉన్నాడు. కాలు గాలి న పిల్లిలా తోచకుండా హోటల్ గదిలో తిరుగుతున్నాడు. అట్లా హఠాత్తుగా మానేయొద్దని ఆ తర్వాత డాక్టర్లు చెప్పారట. శ్రీశ్రీతో పరిచయమయ్యాక ఆయన ప్రత్యేక బ్రాండు (హ్యావర్డ్)తో పరిచయం కాకుండా ఎవరూ ఉండరు. అది ఆయన పెట్టెలో ఉంటుంది. రాగానే అది చూపి అది అయిపోగానే అటువంటిది తెప్పించమని చెప్తాడు కూడ. ఉంటే డబ్బులు ఆయనే ఇస్తాడు.

'నవత' కవిత్వ పత్రిక ప్రారంభ సంచిక వెలువడినపుడు (1963), త్రీ చీర్స్ ఫర్ మాన్ (శ్రీశ్రీ కవిత్వానికి శ్రీశ్రీదే అనువాదం) వెలువడినపుడు (1964) ఆయనతో స్వయంగా నాకు ఈ వ్యసనానికి సంబంధించిన చేదు అనుభవాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్ వచ్చి కూడ ఈ కారణంగా 'నవత' ఆవిష్కరణ సభయే జరుపలేకపోయాం. కాని 1970లో విరసం ఏర్పడినాక 72లో భారత చైనా మిత్రమండలి వరంగల్ సిటీ సభలు జిల్లా సభలు (వరంగల్‌లో), కరీంనగర్‌లో జిల్లా సభలు (హుజూరాబాద్‌లో) ప్రారంభించడానికి వచ్చినప్పుడు రెండు రోజులు హనుమకొండ రెడ్డి కాలనీలో మా ఇంట్లో ఉన్నాడు.

సభలు అయిపోయేంత వరకు మందు ముట్టుకోవద్దని కఠినంగా చెప్పాను. బుద్ధిగా పాటించాడు. నా 'చలినెగళ్లు' కవితా సంకలనానికి ఆయనతో ముందుమాట రాయించుకోవాలని 1963 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాను. హైదరాబాద్ ప్యాలెస్ టాకీసు (అబిడ్స్‌లో ఉండేది)లో 'వెలుగు నీడలు' సినిమా విడుదలయి వచ్చినప్పుడు కలిసాను. గోల్డెన్ థ్రెషోల్డ్‌లో అప్పుడు మైసూరు కేఫ్ ఉండేది. అక్కడే దిగేవాడు. 'రాత్రి' కవులంతా అక్కడే కలిసాం. అప్పుడాయనకు నా 'చలినెగళ్లు' రాతప్రతి ఇచ్చాను.

'నవత' పత్రికకు గౌరవ సంపాదకునిగా ఒప్పించడానికి ఆయనకు ఉత్తరం రాసాను. 'జననం అనగానే మరణం గుర్తుకొస్తుంది. అయినా జననం ముదావహం' అని అంగీకారం తెలుపుతూ జవాబు రాసాడు. ముందుమాట గురించి కూడా చాలసార్లు రాసాను. పిచ్చిరెడ్డి అనే మిత్రునితో కలిసి రమణస్తాన్ వెళ్లినప్పుడు మద్రాసులో ఆయన ఇంట్లో మొదటిసారి కలిసాను. 1968 దాకా ప్రయత్నించి ఇంక ఆయన ముందుమాట లేకుండానే 'చలినెగళ్లు' వెలువడింది.

సృజన '66 నవంబర్‌లో తిలక్ ప్రత్యేక సంచికగా ప్రారంభమైన దగ్గర్నించి కూడా శ్రీశ్రీ అడిగిందే తడవుగా తన రచనలు పంపేవాడు. జడ్చర్ల వంటి మారుమూల ప్రాంతాల్లో ఆయన స్వదస్తూరీలో రచనలు, ఉత్తరాలు రావడం చూసి మా సహాధ్యాపకులు నా గురించి గర్వంగా ఫీలయ్యేవారు.

ఫిబ్రవరి 1970 సృజన 14వ సంచికను శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా 170 పేజీలతో తెచ్చాం. దానికోసం చాల ముందుగానే శ్రీశ్రీ హైదరాబాద్‌కు వచ్చిన ఒక సందర్భంలో బృందావన్ హోటల్లో చలసాని ప్రసాదరావుగారు ఇరవైమంది రచయితలతో దినమంతా ఒక ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేసాడు. తర్వాత కాలంలో దానికి చాల ప్రచారం వచ్చింది. అప్పుడాయనతో విడివిడిగానూ, అందరం కలిసి ఎన్నో ఫొటోలు తీయించుకున్నాం. దిగంబర కవులతో ఆయన ఫొటో ఎన్నోమార్లు ఎన్నోచోట్ల ప్రచురించబడింది కూడ.

విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తిలో బహిరంగసభ వేదికపై శ్రీశ్రీ ప్రత్యేక సంచిక సృజనను ఆయన చేతికి ఇచ్చి నేను మాట్లాడాలన్నది కూడ ఒక కార్యక్రమం. కాని ఆ జనసముద్రం ముందు నిలబడడానికి భయమేసింది. వేదికమీద చూస్తే తెన్నేటి విశ్వనాథం, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ మొదలైనవారు.. 'నిన్న విడిచిన పోరాటం నేడు అందుకోక తప్పదు' అనే శీర్షికతో రాసిన సంపాదకీయం భయం భయంగా చదివి సృజన కాపీ ఆయన చేతిలో పెట్టి కిందికి దిగి ఊపిరి పీల్చుకున్నాను.

మళ్లీ ఆయనను 70 జూలై 3 రాత్రి ఇంపీరియల్ హోటల్లో కలుసుకున్నాను. చలసాని ప్రసాద్ తీసుకొచ్చాడు. మర్నాడు అభ్యుదయ సాహిత్య వేదిక సదస్సుకు వెళ్లవద్దని, బహిష్కరించే కరపత్రాలు పంచి, విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ ప్రకటన చేయాలని చర్చ. తాను వెళ్లి ముఖ్యమంత్రి చేతులమీదుగా ఇచ్చే రెండువేల రూపాయల చెక్ నిరాకరించి, బహిష్కరించి వస్తానని కాసేపు, ఆ వేదిక మీదనే శ్రీకాకుళ ఉద్యమాన్ని సమర్థించే సాహిత్య సంస్థను ప్రకటించి వస్తానని కాసేపు శ్రీశ్రీ ప్రతిపాదనలు- ఏర్పడబోయే సంస్థకు లావారసం అనే పేరు పెడదాం- అని మళ్లీ తానే లాక్షణిక వాద రచయితల సంఘం అని విడమర్చి చెప్పాడు.

ఏం చెప్తున్నాడు అని మేమంతా ఆశ్చర్యంగా చూస్తుంటే మన లాక్షణికవాదం మార్క్సిజమే కదా అని ముక్తాయింపు ఇచ్చాడు. ఏమైతేనేం జూలై 3 అర్ధరాత్రి అబిడ్స్ ఇంపీరియల్ హోటల్లో శ్రీశ్రీ అధ్యక్షతన విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. ఆ చారిత్రక పత్రంపై సంతకం చేసినవారిలో శ్రీశ్రీతోపాటు మరో పది పద్నాలుగు మందిలో నేనూ ఉన్నాను.

ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ వర్తక సంఘం హాల్‌లో 1970 అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగిన మహాసభలకు శ్రీశ్రీ విరసం మొదటి ప్రచురణ 'ఝంఝ' కవితా సంకలనం స్వయంగా అచ్చువేయించుకొని వచ్చాడు. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన వాళ్లలో నేనూ ఉన్నాను. రెండు చేతుల్లో రెండు పుస్తకాల కట్టలు - ఝంఝ - 'నరుడో భాస్కరుడా' పాట పాడుతూ పెట్టెలో నించి దిగుతూ ఆ కట్టలు మాకందించాడు. సభల్లో విరామం దొరికినపుడల్లా ఆ పాటే పాడుతూ ఉన్నాడు.

ఆ పాట గురించే చెప్తూ ఉన్నాడు. ఆ పాట రాసిన శివుడు - (ఆ తర్వాత కాలంలో శివసాగర్) కె.జి.సత్యమూర్తి అని, ఆయన అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్ నాయకుడని చెప్పాం. ఇంక ఆనాటి నుంచి ఎమర్జెన్సీలో ఇరవై సూత్రాలను బలపరుస్తూ ఇందిరాగాంధీ లెఫ్ట్ నియంతృత్వం అన్నందుకు ఆయనను విరసం నుంచి సస్పెండ్ చేసేదాక, ఎమర్జెన్సీ ఎత్తివేసినాక విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన క్షమాపణలతో సభ్యునిగా కొనసాగించి 83 జూన్ 15న మద్రాసులో శ్రీశ్రీ కన్ను మూసేదాకా మేం కలిసి పనిచేసిన సంస్థలో ఎన్ని కలయికలో.. ఎన్ని జ్ఞాపకాలో..

కవులు, రచయితలు కాని సాహిత్య పిపాసులకు అభిమాన రచయితల పట్ల ఎంత ఆరాధనా భావం ఉంటుందో ఒక అనుభవం చెప్తాను- నేను జడ్చర్ల కళాశాలలో పనిచేస్తున్నపుడు 1968లో జలజం సత్యనారాయణ పూనికతో 'మానవుడే మా సందేశం' అనే కవితా సంకలనం అచ్చేసి ఆవిష్కరణకు శ్రీశ్రీని పిలిచాం. తిరుగుటపాలో మా ఆహ్వానాన్ని మన్నించి తాను సరోజతోపాటు వస్తానని రాసాడు. జడ్చర్ల 'సాహితీమిత్రులు'లో వేణుగోపాలరావు అని డిసిటిఓ ఉండేవారు.

శ్రీశ్రీ, రావిశాస్త్రిలకు వీరాభిమాని. అప్పటికి ఆ ఇద్దరి సాహిత్యం కంఠోపాఠం. అంగీకారం వచ్చిన దగ్గర్నించి, రావడం లేదని చల్లని కబురు వచ్చేదాకా ఆయన పడిన హైరాన, చేసిన ఏర్పాట్లు, ఎదురుచూపులు ఇక్కడ ఎంత రాసినా తక్కువే. ఆ ఇద్దరికోసం ఆ దంపతులు కొన్న పట్టువస్త్రాలు, ఆయన దృష్టిలో అంతటివారు ఇంకెవరూ లేరు గనుక అట్లాగే అనాచ్ఛాదిత నిరాక్షణా వస్త్రాలుగా భద్రంగా ఉండే ఉంటాయి.

ఎంత సులభంగా వస్తానని ఒప్పుకుంటాడో, అంతే సులభంగా మానేసే ఈ స్వభావం విరసం, ఎపిసిఎల్‌సి, భారత చైనా మిత్రమండలి వంటి సంస్థల అధ్యక్షత స్వీకరించాక బాధ్యతాయుతంగా మార్చుకున్నాడు. హుజూరాబాద్, కరీంనగర్, బెల్లంపల్లి, సూర్యాపేట, వనపర్తి- ఏ మారుమూలకు పిలిచినా సభలకు వచ్చాడు. మాటలే పెగలనివాడు, అనర్గళంగా ప్రసంగాలు చేసాడు. వరంగల్, తుంగతుర్తి వంటి సభల్లో మైళ్లకొద్ది దూరం ఊరేగింపుల్లో ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు ఇస్తూ నడిచాడు.

లెనిన్ శతజయంతిని పురస్కరించుకొని ఆయన వరంగల్ సుడిగాలి పర్యటన చేసాడు. తెలుగు నాటకరంగంపై లెనిన్ ప్రభావం అని ఏదో అఖిల భారత సదస్సుకు ఇంగ్లిష్‌లో రాసిన వ్యాసాన్ని వరంగల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చదివి వినిపించాడు. కాకతీయ మెడికల్ కాలేజి మాగజైన్‌కు వాళ్లడిగితే అచ్చేసుకోవడానికి ఇచ్చాడు.

ఆ సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియంలో ప్రసంగించాడు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే పథకం ప్రకారమే వెనుక గుంపుగా చేరిన ఎబివిపి విద్యార్థులు కుర్చీలు లాగుతూ, గోల చేస్తూ గందరగోళం సృష్టించారు. సహజంగానే శ్రీశ్రీ అభిమానుల సంఖ్య ఎక్కువ కనుక వాళ్లు తోకముడవాల్సి వచ్చింది. శ్రీశ్రీ ఎంతో ఆవేశంగా చాలసేపు ప్రసంగించడం ఆరోజే చూసాను. ఈ మూడు చోట్లకూ ఆయన వెంట నేను తిరిగాను. ఆ తర్వాత ఒక వివాదంగా మార్చి ఎబివిపి విద్యార్థులు ఆయన వ్యాసం కాగితాలు చింపి కానీ మాగజైన్ పంచడానికి వీలు లేదని కాలేజ్ ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చారు. జిల్లా యంత్రాంగం ద్వారా మౌఖిక ఆదేశాలిప్పించారు.

అప్పుడే సృజన కవర్‌పై శ్రీశ్రీ బొమ్మ, ఆయన ఇంగ్లిష్‌వ్యాసం కాపీ ఫొటో వేసి 'ఎన్ని హృదయాల నుంచి శ్రీశ్రీని చించగలరు?' అని సంపాదకీయం రాసాను. శ్రీశ్రీవైపు నిందాపూర్వకంగానో, నిషేధిస్తూనో ఎవరైనా వేలు చూపితే ఇప్పటికీ ఇదే మాట వర్తిస్తుందనుకుంటాను. ఎందుకంటే శ్రీశ్రీని దగ్గరగా చూసిన ఎవరికైనా ఆయన శిశువు వలె హృదయానికి దగ్గరవుతాడు.


- వరవరరావు
(15న శ్రీశ్రీ వర్ధంతి)

No comments:

Post a Comment